Thursday, April 23, 2009

బెల్ట్ భాగవతం

ఓ రోజు పొద్దున్నే ఎవడో తలుపు కొడుతున్నాడు, వెళ్ళి తీస్తే ఒకాయన ఒక పాకెట్ పట్టుకొని నిల్చొని వున్నాడు. ఏంటి అని అడిగితే నరేంద్ర కి పార్సల్ వచ్చ్చింది చెప్పాడు. నరేంద్రా నీకేదో పార్సల్ అంటా అని పిలిస్తే వచ్చి తీసుకున్నాడు. పార్సల్ చూడటానికి రంగురంగుల్లోచూడ చెత్తగా వుంది. ఏమి పార్సల్ రా అది? ఏమి లేదురా మొన్న టివి లో పొట్ట తగ్గడానికి బెల్ట్ చుపించాడురా,ఒకటి ఆర్డర్ చేసారా ఇప్పుడు అది వచ్చింది అని చెప్పాడు. నీ కేమైనా మతిపోయిందా అవేమైనా పని చేస్తాయనుకున్నావా ఊరికినే డబ్బులు వేస్ట్ చెయ్యటానికి కాకపోతే అని అంటుంటే మధ్యలోనే అందుకుని నిజంరా ఇది చాలా బాగా పని చేస్తుంది, మూడు రోజుల్లోనే ఎటువంటి పొట్టనైనా తగ్గించేస్తుందిరా, నాకెలాగు మూడు రోజుల్లో తగ్గిపోతుంది తర్వాత నువ్వే వాడుకో అన్నాడు. నువ్వెక్కడ దొరికావురా టీవీ లో చూసేవాన్ని నిజం అనుకుంటావ్, ఇంకా సంతోషం ఈ మధ్య న్యూస్ చానల్స్ చూడటం లేదు ఒకవేళ చుస్తే మన రాష్ట్రం లో ౬౦౦ కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు వున్నాయి అనుకుంటావ్, నాకేమి వద్దు కాని నువ్వే పండగ చేసుకో అని చెప్పి స్నానానికి అని బాత్ రూమ్ లో దూరా(అప్పుడప్పుడైనా స్నానం చెయ్యాలని ఈ మధ్య నిర్ణయించుకున్నా)
ఆ రోజు మొదలు నరేంద్ర గదికి ఆ బెల్టే లోకం అయ్యిపోయింది, ఏమి చేసినా బెల్ట్ వుండాల్సిందే, కుర్చున్నా,పడుకున్నా, తిన్నాతిరిగినా చివరికి స్నానం చేసినప్పుడు కూడా వుండాల్సిందే(చీ చీ నేను స్నానం చేసినప్పుడు చూడలేదు).ఎంతగా వాడటం మొదలెట్టదంటే చివరికి మాములు బెల్ట్ మానేసి దాని స్థానం లో ఈ బెల్ట్ నే వాడటం మొదలెట్టాడు. అది పెట్టుకొనే ఆఫీసుకి కూడా పోతున్నాడు.వాళ్ల తమిళ మేనేజర్ కి ఆ బెల్ట్ చాలా నచ్చిందట కుడా. వాడటం మొదలు పెట్టిన రోజు నుంచి రోజు అడగటమే ఏమైనా తగ్గుతుందా అని, మొదటిలో బాధపడతాడు కదా అని ఏదో తగ్గుతుంది తగ్గబోతోంది అని చెప్పేవాడిని, రాను రాను నా ఓపిక తగ్గిపోయింది.

ఒక ఆరు నెలల కఠోర బెల్ట్ దీక్ష తరువాత ఒక రోజు కొంచెం జ్ఞానోదయం అయ్యింది, ఈ బెల్ట్ మంచిది కాదు, పని చెయ్యదు అని. పూర్తీ గ అయ్యుంటే అన్నియాడ్ లు నిజం కాదు అని నమ్మేవాడు. ఇంక ఈ బెల్ట్ తో లాభం లేదనుకుని ఇంక ఏదైనా ట్రై చెయ్యాలని డిసైడ్ ఐపోయాడు, తర్వాత ఏమి చెయ్య బోతున్నడో ఏమో నాకింకా తెలియదు, నాకు తెలిసిన వెంటనే మొదట మీకే చెప్తాను.

Friday, April 17, 2009

చూడొద్దంటున్నా చూస్తూనే వుంటా (పోకిరి) పాటకి పేరడీ



పల్లవి : కొట్టొద్దంటున్నా కొడుతూనే ఉంటా తొడ కొట్టేటందుకే నేను పుట్టాననుకుంటా

తిప్పందంటున్నా తిప్పుతూనే ఉంటా మీసాన్ని తిప్పేటందుకే మీ ముందుకొస్తున్నా

కొట్టైనా కొట్టైనా తొడ అంత కందిపొయేలా

తిప్పైనా తిప్పైనా తిప్పైనా ...

(ఫాన్స్) వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా మా బాలయ్య

వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా పరువె తీయొద్దయ్యా





చరణం : కష్టపడి నేను సినిమాలు చేస్తే ఫ్ల్లాపౌతున్నాయి

ధియేటర్స్ అన్నీ ఖాళీగ నన్ను వెక్కిరిస్తున్నాయి

ఎన్నేళ్ళైనా హిట్టులు లేక పిచ్చెక్కిపొయింది

వేరేదేదీ చేతేకాక వెర్రెక్కిపోయింది

సినిమాలే చేద్దామంటే నిర్మాతరాకుండే

ప్రజలేమో నన్నింకసలు పట్టించుకోకుండే

ఖాళీగా కూర్చున్న నన్ను బావే పిలిచాడు

తొడకొట్టి ప్రచారమేదో చెయ్యాలన్నాడు

వచ్చేస్తా వచ్చేస్తా మీ ఊరు నేను వచ్చేస్తా

కొట్టేస్తా కొట్టేస్తా కొట్టేస్తా ..



(ఫాన్స్) వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా మా బాలయ్య
వద్దయ్యా వద్దయ్యా వద్దయ్యా పరువె తీయొద్దయ్యా






దయ చేసి గమనించగలరు, ఈ ప్రయత్నం ఎవరినీ కించపరచటానికి గానీ ఎవరినీ బాధపెట్టతానికి కానీ చేసినది కాదు, సరదాగా నవ్వుకోవటానికి మాత్రమే. ఎవరినైనా నొప్పించివుంటే క్షమించగలరు.

Friday, May 9, 2008

నాలోని "సుమన్" నిద్ర లేచాడు

ఇప్పటికి నాలోని "సుమన్" నిద్ర లేచాడు.లేచిన వాడు లేచినట్టు ఉండక ఒక్కటే పోరు, నాలుగు నెలలు అయ్యింది బ్లాగు తయారు చేసుకున్నావు, ఎప్పుడు మొదలు పెడతావు అని.బాబూ ఎదో ఆవేశంలో తయారు చేసేసాను అని ఎంత చెప్పినా వినటం లేదు.ఎలాగైనా ఎదైనా రాసే తీరాలి అని ఒక్కటే గోల, కోవై సరళ కామెడీ లాగా(గోలే తప్ప విషయం లేనట్టు).ఏమి చేస్తాం ఏమద్య అందరు రాసినవీ క్రమం తప్పకుండా చదువుతున్నాడు కదా ఆమాత్రం ఆవేశం సహజం, కాని దాన్ని నామీద రుద్దితే ఎలా,సుమన్ దెబ్బకి నేను తట్టుకోగలనా?(ఎవ్వరికీ సాధ్యం కాదు అనుకోండి).వీడి పోరు పడటం కంటే ఎదో ఒకటి రాసేయటమే మేలు అనుకొని రాయటం మొదలుపెట్టాను.నా పరిస్థితి ఎలా ఉందంటే హీరో డేటులు దొరికయి కదా అని సినిమా మొదలు పెట్టేసిన డైరెక్టర్ లా వుంది,కథ లేదు, కథనం తెలియదు.ఏదోలా రాయటం పూర్తి చేసేసి మొదటి నుంచి మళ్ళీ ఒక్కసారి చదువుకుందును కదా, నా పరిస్థితి మరీ దారుణంగాతయారయ్యింది, ఫ్లాప్ సినిమా డైరెక్టర్ లా, ఎమి రాద్దమనుకున్ననో? ఏమి రాసానో? తెలియకుండా.

ఏమి చేస్తాం సినిమా మొత్తం తీసేసాక రిలీజ్ చెయ్యటం మానేస్తామా? రిలీజ్ చేసేద్దాం, ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేద్దాం.రేపు జరిగే "సక్సెస్ మీట్" లొ కలుద్దాం, నమస్కారం.